పులిరాజాకు నక్క చాడీలు తెలుగు కథ || The Tiger and the Greedy Fox Telugu video || grandma stories #పులిరాజాకునక్కచాడీలు #Telugukathalu #bedtimestories
************ పులిరాజాకు నక్క చాడీలు. ***************
ఒక పెద్దపులి అడవికి కొత్తగా రాజయ్యింది. రాజన్నాక పక్కన మంత్రి ఉండాలిగా... మంత్రిగా ఎవరిని నియమించుకోవాలా అనే ఆలోచనలో పడింది. ఆ విషయం నక్కకు తెలిసి.. ఎలాగైనా ఆ మంత్రి పదవిని చేజిక్కించుకోవాలనుకుంది.
ఒక రోజు బుట్టనిండుగా మామిడి పండ్లను తీసుకుని పులి స్దావరానికి బయలుదేరి వెళ్లింది ఆ జిత్తుల మారి నక్క. గుహ ముందు పెద్దపులి ఒంటరిగా కనిపించడంతో తను సరైన సమయానికే వచ్చానని లోలోపల ఆనందపడింది ... ధైర్యంగా దాని దగ్గరకు వెళ్ళి ఆ మామిడిపండ్ల బుట్టను అందించి ఇలా అభినందించింది.
" పులి రాజా.. మీలాంటి మంచి మనసున్న వారు ఈ అడవికి కొత్తగా రాజైనందుకు హార్దిక శుభాకాంక్షలు.. నాకు తెలుసు, ఈ అడవిలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఇకపై మీరు వింటారు.. అక్కడ అందరి కంటే ముందుగా మీరు వుంటారు.. "
నక్క తనను అంతలా పొగుడుతుంటే మొదట మొహమాటంలో పడ్డా.. తర్వాత, పులికి చాలా ఆనందమనిపించింది. అభినందనలు తెలిపిన నక్కకు ధన్యవాదాలు తెలిపింది.. అవి రెండూ నవ్వుతూ చాలా సేపు ముచ్చటించుకున్నాయి.
ఆ రోజు నుంచి నక్క రెచ్చిపోయింది. రోజూ అది పులి వద్దకు వెళ్లడం ఆరంభించింది.
రోజుకొక జంతువు మీద పులికి ఫిర్యాదు చేస్తుండేది. ఒకరోజు పెద్దపులి కంటే ఎత్తుగా ఉంటానని ఏనుగుకి గర్వమని చెప్పింది. మరొకరోజు తనకు దక్కవలసిన పదవి పులి కొట్టేసిందని సింహాం కోపంతో రగిలిపోతోందంటూ రెచ్చగొట్టింది. ఇంకోరోజు తనలాగ చెట్ల మీద గెంతలేదని కోతి కూడా హేళన చేసిందని చెప్పింది. ఇలా రోజూ నక్క అడవిలోని ప్రతి జంతువూ పులిని తేలిక చేసి మాట్లాడుతున్నట్లు చెబుతుండేది. తానొక్కటే తమ వద్ద భయభక్తులతో ఉంటానని పులికి నూరి పోస్తుండేది.
రోజూ ఒకే తీరుగా నక్క చెబుతున్న మాటలు పెద్దపులి ఎన్నాళ్లు వినగలదు?! కొన్నాళ్లకు ఆ మాటలు దానికి విసుగనిపించాయి.
ఒకసారి నక్క చెబుతున్న మాటల్లో నిజమెంతో తెలుసుకోవాలని పులి అడవంతా తిరిగింది. అడవిలోని జంతువులన్నీ తమ అభిమానాన్ని చాటుకున్నాయేగానీ, చులకనగా చూడలేదు.. అలాగే, సింహం కూడా పెద్దమనసుతో అడవికి రాజైన పెద్దపులిని చాలా అభినందించింది.
తరువాత పెద్దపులి అడవిలో వున్నట్టుండి సంచారం చేయడం, అన్ని జంతువులూ భయభక్తులు ప్రదర్శించడం గురించి తెలిసిన నక్క కంగారుగా గుహ దగ్గరకు పరుగున వచ్చి దానితో ఇలా అంది.
‘‘మీరు అమాయకులు! నా మాట నమ్మండి. మీరు కనిపించేసరికి జంతువులు బాగా నటించి వుంటాయి. మీరది తెలుసుకోలేక పోతున్నారు. ఈ పరిస్థితుల్లో నాలాంటి మంత్రి మీ పక్కన ఉంటేనే మంచిది!’’
నక్క నంగనాచి మాటలతో పులిరాజాకి దాని ఎత్తుగడ అర్థమయింది. అరికాలి మంట నెత్తికెక్కింది.. కోపంతో ఒక్క తన్ను తన్నింది. దాంతో దూరంగా ఎగిరిపడిన నక్క మంత్రి పదవి మీద ఆశలు వదులుకుని బతుకు జీవుడా అని అక్కడినుండి పారిపోయింది.
ఈ కథలో నీతి ఏమిటంటే.. "ఎదుటివారిపై చాడీలు చెప్పడం మంచిదికాదు..అందరితో కలిసి మెలిసి జీవించాలి."
0 Comments